ప్రజలోడిస్తే.. ఇంట్లో కూర్చుంటా: కేసీఆర్

గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. తెలంగాణ విపక్షాల మధ్య నడుస్తున్న మాటల యుద్ధంలో మరో అంకం మొదలైంది. తాను చేసిన సర్వేలో తమకు 111 సీట్లు వస్తాయని కేసీఆర్ చెప్పుకోవటం.. దీనిపై విపక్షాలు విరుచుకుపడటం తెలిసిందే.

తాజాగా పాత అదిలాబాద్ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్.. కాంగ్రెస్ సీనియర్ నేత పైడిపల్లి రవీందర్ రావులు కలిసి టీఆర్ ఎస్ లో చేరారు. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించే వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువాల్ని వారి మెడలో కప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాలపై ఫైర్ అయ్యారు. ఓ చిత్రమైన సవాలు విసిరారు. తాము చేసినవి బోగస్ సర్వేలుగా చెబుతున్న పార్టీలకు తానో సవాలు విసురుతున్నానని.. వారికి నిజంగా నమ్మకం ఉంటే.. తమ పదవులకు రాజీనామాలు చేయాలని.. ఆపై ఎన్నికలకు పోదామన్న ఆయన.. టీఆర్ ఎస్ నేతలు ఇప్పటికే పలుమార్లు రాజీనామాలు చేశారని.. మరి.. తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళదామా? అంటూ సవాలు విసిరారు.

అవాకులు చవాకులు పేలటం మానేసి.. మీ సర్వే మీరు చేసుకోండి.. ఫలితాల ప్రకారం నడుచుకోండి.. అదే సమయంలో మా సర్వే మేం చేసుకుంటామన్న కేసీఆర్.. తాము పిచ్చిగా సర్వేలు చేయమన్నారు.”టీఆర్ ఎస్ కు 111 సీట్లు అని చేసిన సర్వే బోగస్ అని బీజేపీ నేతలు అంటున్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ కూడా ఓ సర్వే చేశారు. దాని ప్రకారం మోడీకి ఆదరణ శాతం 39 నుంచి 46 శాతానికి చేరిందని చెబుతున్నారు. వాళ్లు చేసిన సర్వేనేమో కరెక్టు.. మేం చేసిన సర్వే తప్పట. సర్వేలే తప్పు అయినప్పుడు మీ సర్వే కూడా తప్పు అవుతుంది. సర్వేలు ఆటోమేటిక్ గా చేసినవి కావు. బోగస్ కాదు. మీ దమాక్ లు బోగస్ గా ఉన్నాయి” అంటూ నిప్పులు చెరిగారు.

వాస్తవాల్ని జీర్ణించుకోలేని రీతిలో నిజాలు ఉంటాయని.. ప్రజలు నిర్ధాక్షిణ్యంగా ఉంటారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మంచి పాలన చేస్తోంది. మొత్తంగా లేని టీడీపీ.. ఉనికి లేని బీజేపీ.. కాలగర్భంలో కలిసిపోయిన కమ్యూనిస్టులు కన్ ఫ్యూజ్ చేస్తున్నారన్న కేసీఆర్.. జిల్లాల్లో.. మండలాల్లో ప్రజలు తమను నమ్ముతున్నారన్నారు. బీజేపీకి ఇప్పుడున్న ఐదు సీట్లు కూడా రావన్నకేసీఆర్.. గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పునరావృతం కానున్నట్లుగా చెప్పారు.

కాంగ్రెస్ ను సపరేట్ గా టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్.  ‘‘కాంగ్రెస్ వాళ్లను అడుగుతున్నా. మీకు ఎందుకు ఓట్లు వేయాలి!? ఏం చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతారు? మీరు స్వర్గం నుంచి ఏమైనా ఊడిపడ్డారా? ప్రజలకు మీ గురించి మీ పాలన గురించి తెలియదా? ఒకే ముచ్చట చెబుతున్నా.. ఇదే కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కరెంటు కోసం రైతులను పారిశ్రామికవేత్తలను విద్యార్థులను ఎన్నో ఇబ్బందులు పెట్టాయి. ట్రాన్స్ఫార్మర్లు కాలి బోర్లు ఎండి పంటలు పండక ప్రజలు సచ్చిపోయిండ్రు. తెలంగాణ వచ్చాక.. అద్భుతమైన పద్ధతిలో ఎవరి ఊహకు అందకుండా 6 నెలల్లోనే కరెంటు కష్టాలను సరిచేసి.. దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా హైవోల్టేజీ కరెంటు ఇస్తున్నాం. ఒక్క మోటారు ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోవటం లేదు. ఈ ఒక్క పాయింట్ చాలదా? మా పనితీరు మీ పనితీరు ప్రజలు తెలుసుకునేందుకు’’ అని సీఎం ప్రశ్నించారు.

గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి ఇసుక మైనింగ్ ద్వారా రూ.25 వేల కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చేదని పదేళ్ల కాలంలో కాంగ్రెస్ నేతలు దోచుకోగా చివరకు రూ.5 లక్షలకు సంవత్సరాదాయం పడిపోయిందన్నారు.‘టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నోరు కడుపు కట్టుకొని పనిచేసి ఇసుక ద్వారా వచ్చే ఆదాయం రూ.370 కోట్లకు తెచ్చాం. అది గత ఏడాదిలో రూ.450 కోట్లు వచ్చింది. ఈ ఏడాది మరింత నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తే 650 కోట్లకు చేరుతుంది. మీ కాలంలో ఇసుక దోచుకుంది.. అమ్ముకుంది ఎవరో ప్రజలకు తెలుసు’’ అని మండిపడ్డారు.

మైనింగ్ ఆదాయం పింఛన్ల రూపంలో తిరిగి ప్రజలకు పోతోందన్న కేసీఆర్.. ఆసుపత్రుల్లో చనిపోయిన వారిని వారి ఇంట్లో దింపేందుకు అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని ఎప్పుడైనా యోచించారా అని ప్రశ్నించారు. ‘‘మీ కాలంలో ఎరువులు దొరికాయా? మీ హయాంలో తెలంగాణ గోదాముల సామర్థ్యం 4 లక్షల టన్నులు. ఈ రోజు 24 లక్షల టన్నులు. ఎరువులు విత్తనాలు కరెంటు కొరత లేదు. అందుకే రైతులు మాకు ఓట్లు వేస్తామన్నారు. యాదవులు చేనేతలు మత్స్య కార్మికులు నాయీ బ్రాహ్మణులు.. ఇలా అన్ని వర్గాలనూ పట్టించుకుంటున్నాం. ఇంత జేసినంక ఎందుకు మాకు ప్రజలు ఓట్లు వేయరు? 111 సీట్లు ఎందుకు రావు?’’ అన్నారు. జాతీయ నేతల అంచనాలను తలకిందులు చేస్తూ అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా దూసుకెళుతోందని అనతి కాలంలోనే ఇంత ప్రగతి సాధించడం ఓ చర్రిత అన్నారు. మైనారిటీ – ఎస్సీ – ఎస్టీలకు తాము 12 శాతం రిజర్వేషన్లు పెట్టామని త్వరలోనే వారికి రిజర్వేషన్లు రానున్నాయి”  అని చెప్పారు.

‘‘ఇప్పుడు చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా చేనేత కార్మికులకు 50 శాతం సబ్సిడీపై ఊలు రంగులు రసాయనాలు ఇస్తున్నాం. ఎన్ని లక్షల మీటర్ల దుస్తులున్నా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నాం. అంగన్వాడీ వర్కర్లను మీరు మనుషుల్లా చూశారా..? వాళ్లకు జీతాలు పెంచాం. వీఆర్ఏలకు కూడా రూ.10 వేలు ఇస్తున్నాం. వాళ్లు మీకు ఓటు వేస్తారా. మాకు వేస్తారా? ఏమి సంతోష పెట్టిండ్రని మీకు ఓటు వేయాలి!?’’ అని నిలదీశారు. 111 సీట్లు వస్తాయనేది పాజిటివ్ సైన్… నాటే నెగిటివ్ సైన్’’ అని అన్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల విషయంలో కాంగ్రెస్ నాయకులు 15 రోజుల్లోనే నాలుగుసార్లు కోర్టుకు వెళ్లారన్నారు. స్టే కావాలన్న వారిని ఓ న్యాయమూర్తి చీవాట్లు పెట్టారన్నారు.ఇప్పటికైనా పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలన్నారు. జూన్ 3 నుంచి పంపిణీ చేసే కేసీఆర్ కిట్లతో కాంగ్రెస్.. ప్రతిపక్షాల గుండెల్లో బాంబులు పేలుతాయన్న కేసీఆర్.. స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రభుత్వం చేయని రీతిలో గర్బిణులకు రూ.12వేలు ఇస్తున్నామని.. శిశువులకు కేసీఆర్ కిట్ల పేరుతో మంచి దుస్తులు.. ధనవంతుల పిల్లలు వాడే జాన్సన్ కంపెనీ ఉత్పత్తుల్ని ఇవ్వనున్నట్లుగా చెప్పారు. కేసీఆర్ కిట్లు పోతే ప్రతిపక్ష నేతల గుండెల్లో బాంబులు పేలుతాయన్నారు.

రమేశ్ రాథోడ్ చాలా స్థాయిల్లో పని చేశారని.. ఆయన టీఆర్ఎస్లో చేరటం సంతోషమని.. ఆయన స్థాయికి తగ్గట్లు పార్టీలో గౌరవిస్తామన్న కేసీఆర్.. రాథోడ్ భవిష్యత్తునకు తనదీ పూచీ అన్నారు. ‘‘మనసు నిండా పనిచేద్దాం. ఎన్నికలకు పోదాం. ప్రజలు ఆదరిస్తే సరి… లేకుంటే ఇంట్లో కూర్చుంటాం. కానీ మీలా పిచ్చికూతలు కూయం’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మొత్తానికి గడిచిన కొద్ది రోజులుగా తనపైనా.. తన పార్టీ పైనా మండిపడుతున్న ప్రతిపక్షాలకు ఒక్క స్పీచ్ తో అందరికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *