ఖమ్మం మేయర్ పాపాలాల్ పై అవిశ్వాసానికి పట్టు

ఖమ్మం నగర మేయర్‌ పాపాలాల్‌కు సొంత పార్టీ కార్పొరేటర్ల నుంచే తిరుగుబాటు ఎదురైంది. పార్టీ కార్పొరేటర్లకు, మేయర్‌కు మధ్య ఏర్పడిన అగాధం జిల్లాలో రాజకీయ దుమారం రేపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పించాల్సిందేనని అధికార పార్టీకి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కార్పొరేటర్ల అంతా భేటీ అయ్యి మొత్తం 42 మందికి గాను 37 మంది సభ్యులు తీర్మాన ప్రతిపై సంతకాలు చేసి ఎమ్మెల్యేకి అందించారు. ఈ సందర్భంగా అజయ్‌ వద్ద కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాపాలాల్‌ తమ డివిజన్‌ పర్యటనకు వచ్చిన తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడంలేదని వాపోయారు.

దీనికి స్పందించిన అజయ్‌కుమార్‌.. తాజా పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, పార్టీకి నష్టం చేసే ఎలాంటి చర్యలను కూడా సమర్థించమని  స్పష్టం చేశారు. నగరంలోని ఒక అతిథి గృహంలో సమావేశమైన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్లు.. కార్పొరేషన్‌ వ్యవహారాలపై,  మేయర్‌ అనుసరిస్తున్న ధోరణిపై వాడీవేడిగా చర్చించారు. మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండడంతో నగర పాలక సంస్థ రాజకీయం రసకందాయంలో పడినట్లయింది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఎవరిని మేయర్‌ చేయాలనే అంశం సైతం ప్రస్తావనకు వచ్చింది. అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత మరోసారి సమావేశమై మేయర్‌ అభ్యర్థిపై పార్టీ సూచనల మేరకు నడుచుకోవాలని మెజార్టీ కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *