రివ్యూ: నా పేరు సూర్య.. ల‌క్ష్యం కోసం పోరాడే సైనికుడు

కథ:

సూర్య (అల్లు అర్జున్‌) నిజాయ‌తీ గ‌ల సైనికుడు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వ‌డానికి కూడా వెన‌కాడ‌డు. ఎదుటివారు చిన్న త‌ప్పు చేశార‌ని తెలిసినా త‌ట్టుకోలేడు. హెడ్ క్వార్ట‌ర్స్ నుంచి బోర్డ‌ర్‌కి వెళ్లాల‌నేదే సూర్య ఉద్దేశం. అందుకోసం క‌ష్ట‌ప‌డుతుంటాడు. కానీ సైనిక నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఒక‌సారి ఓ ఉగ్ర‌వాదిని కాల్చి చంపేస్తాడు. అదే అద‌నుగా తీసుకున్న క‌ల్న‌ల్ (బోమ‌న్ ఇరాని) అత‌న్ని ఆర్మీ నుంచి బ‌య‌టికి పంపించేస్తాడు. అందుకు అంగీక‌రించ‌ని సూర్య త‌న గాడ్ ఫాద‌ర్ (రావు ర‌మేశ్‌)ను సంప్ర‌దిస్తాడు. అంద‌రూ క‌లిసి వైజాగ్‌లో ఉన్న ర‌ఘురామ‌కృష్ణంరాజు (అర్జున్‌) అనే సైక్రియాట్రిస్ట్ ద‌గ్గ‌రకు వెళ్లి ఓ స‌ర్టిఫికెట్ తీసుకుని ర‌మ్మ‌ని చెబుతారు. దాంతో వైజాగ్‌కి వ‌స్తాడు సూర్య. అత‌నికి వ‌ర్ష (అను ఇమ్మాన్యుయేల్‌) తార‌స‌ప‌డుతుంది. ఆమెతో సూర్య ప్రేమ‌లో ప‌డ‌తాడు. అత్యంత కోపంతో తిరిగే సూర్య 21 రోజుల్లోనే మారాడా? అత‌న్ని ర‌ఘురామ‌కృష్ణంరాజు ఎలా మార్చాడు? అత‌నికి, సూర్య‌కి ఉన్న సంబంధం ఏంటి? సూర్య త‌న గోల్‌ని రీచ్ అయ్యాడా? లేదా అనేది మిగిలిన క‌థ‌.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన బలం కథానాయకుడు సూర్య పాత్ర. ఈ పాత్రను రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ మలచిన తీరు చాలా బాగుంది. కోపం, బలం, దేశభక్తి, ప్రేమ వంటి లక్షణాలు కలగలసిన సూర్య పాత్ర స్క్రీన్ మీద కనబడుతున్నంతసేపు చూసే వాళ్ళలో ఒక రకమైన కసి మైంటైన్ అవుతూ వచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే ఆ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు మరొక ఎత్తని చెప్పాలి. నటనలో ఆయన చూపించిన తీవ్రత సోల్జర్ సూర్య పాత్రను చాలా కాలంపాటు గుర్తుండిపోయేలా చేసింది. మాట్లాడే విధానం, నడక, డ్రెస్సింగ్ సెన్స్, రొమాన్స్, కీలమైన ఎమోషనల్ సన్నివేశాలు అన్నింటిలో కొత్త బన్నీ కనిపిస్తాడు.

వక్కంతం వంశీ గతంలో రాసిన ‘కిక్, రేసు గుర్రం, టెంపర్’ చిత్రాల్లాగానే ఈ సినిమా కథనాన్ని కూడా ఫస్టాఫ్ వరకు చాలా రేసీగా రాసుకున్నారు. కథలో నిగూఢంగా దేశానికి శత్రువులు ఎక్కడో తయారవ్వరు మన దేశంలో మనం చేసే తప్పుల వలనే తయారవుతారు, వ్యక్తిత్వాన్ని వదిలేస్తే ప్రాణాలు వదిలేసినట్టే వంటి సున్నితమైన అంశాలను బాగానే చెప్పారు. చిత్రం ఆరంభం నుండి చివరి వరకు తరచూ వచ్చే యాక్షన్ సన్నివేశాలు మంచి థ్రిల్ ఇచ్చాయి.

ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో హీరో పాత్ర తనలోని మార్పు వలన తాను ఏం కోల్పోతున్నాడో రియలైజ్ అవడం బాగుంది. ఇక తన నుండి అందరూ ఆశించే డ్యాన్సుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న అల్లు అర్జున్ మంచి మంచి డాన్స్ మూమెంట్స్ తో బాగా ఎంటర్టైన్ చేశాడు.

మైనస్:

ఫస్టాఫ్ వరకు కథను సూర్య పాత్రను హైలెట్ చేస్తూ బాగానే నడిపిన దర్శకుడు వక్కంతం వంశీ ద్వితీయార్థానికి వచ్చే సరికి చప్పబడిపోయారు. ద్వితీయార్థంలో మొదలయ్యే అసలు కథ చెప్పుకోడానికి, వినడానికి బాగానే ఉన్నా స్క్రీన్ మీద మాత్రం ఉండాల్సినంత ప్రభావంతంగా లేదు. రెండు మూడు సన్నివేశాలు మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇంటర్వెల్ సమయానికి హీరో తనని తాను మార్చుకుని, చివరికి తన లక్ష్యమైన ఇండియా సరిహద్దులకి ఎలా చేరుకుంటాడో చూడాలి అనే ఆసక్తి క్రియేట్ చేసిన దర్శకుడు సెకండాఫ్లో కథను పూర్తిగా వేరే ట్రాక్లోకి తీసుకెళ్లిపోయాడు. ఆయన తీసుకున్న ఆ టర్న్ మంచిదే అయినా ప్రేక్షకుడు ఇంప్రెస్ అయ్యే విధంగా దాని ప్రయాణం లేకపోవడంతో ద్వితీయార్థం దెబ్బతింది.

ఎప్పుడైన ప్రేక్షకుడు బాగుంటుందని ఊహించినదానికి భిన్నంగా వేరే కథనాన్ని చెప్పాలనుకున్నప్పుడు అది ప్రేక్షకుడు బాగుంటుందని కోరుకున్న దానికంటే గొప్పగా ఉండేలా చూసుకోవాలి. ఈ విషయంలోనే దర్శకుడు వంశీ కొంత తడబబడ్డారు. పైగా ప్రతినాయకుడి పాత్రలో బలం లేకపోవడం, హీరోయిన్ పాత్ర కథలో పెద్దగా ఇన్వాల్వ్ కాకపోవడం, కామెడీ, రొమాన్స్, మంచి పాటలు వంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం ద్వితీయార్థాన్ని సాదా సీదాగా మిగిల్చేశాయి.

సాంకేతిక విభాగం:

రచయితగా ‘రేసు గుర్రం, టెంపర్’ వంటి చిత్రాలతో తానేంటో నిరూపించుకున్న వక్కంతం వంశీ ఈ సినిమాతో తనలోనూ మంచి సినిమాలు తీయగల దర్శకుడున్నాడని హింట్ ఇచ్చారు. రేసీ కథనం, గుర్తుండిపోయే సూర్య పాత్ర, పవర్ ఫుల్ డైలాగులతో ఇంటర్వెల్ వరకు సినిమాను బాగానే నడిపిన ఆయన సెకండాఫ్లో మాత్రం ట్రాక్ మార్చి మంచి సందేశాలనైతే ఇవ్వగలిగారు కానీ నెమ్మదైన కథనంతో, బలహీనమైన సన్నివేశాలతో బోర్ కొట్టించారు.

సంగీత దర్శకులు విశాల్, శేఖర్ లు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినా పాటలకు మూడు వంతుల న్యాయం మాత్రమే చేయగలిగారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, కెచ్చ, పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ స్టంట్స్ అభిమానులకు, యాక్షన్ ప్రియులకు మంచి కిక్ ఇస్తాయి. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ క్వాలిటీగా కనబడింది. కోటగిరి వెంకటేశ్వరావుగారి ఎడిటింగ్ సినిమాకు బాగా సహకరించింది. పాటలకు కంపోజ్ చేసిన నృత్యాలు బాగున్నాయి. శిరీష శ్రీధర్ లగడపాటి, బన్నీ వాస్ నిర్మాణ విలువలు సినిమాను ఒక మెట్టు పైనే నిలబెట్టాయి.

విడుదల తేదీ : మే 4, 2018

 రేటింగ్ : 2.5/5

నటీనటులు : అల్లు అర్జున్, అను ఇమ్మాన్యూయేల్, శరత్ కుమార్, అర్జున్

దర్శకత్వం : వక్కంతం వంశీ

నిర్మాత : శ్రీధర్ లగడపాటి, నాగేంద్ర బాబు, శిరీషా లగడపాటి

సంగీతం : విశాల్-శేఖర్

సినిమాటోగ్రఫర్ : రాజీవ్ రవి

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *