రివ్యూ : కృష్ణ‌వంశీ మార్కు ‘నక్షత్రం’

క‌థ‌:

రామారావు (సందీప్‌కిష‌న్‌) తండ్రి, తాత పోలీసులు. దాంతో ఎస్ ఐ కావాల‌న్న‌ది రామారావు, అత‌ని త‌ల్లి (తుల‌సి) క‌ల‌. రామారావు మావ‌య్య (శివాజీరాజా) కూడా పోలీసే. అత‌ని కూతురు (రెజీనా) సినిమాల్లో అసిస్టెంట్ డ్యాన్స‌ర్‌. యాంక‌ర్‌గానూ చేస్తుంటుంది. రామారావు ఎస్ ఐ అయితే పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. స్వ‌త‌హాగా పోలీసుల‌ను ఇష్ట‌ప‌డే రామారావు ఓ రోజు క‌మిష‌న‌ర్ కొడుకు రాహుల్‌(త‌నీష్‌) పోలీసుల‌ను అవ‌మానించాడ‌ని గొడ‌వ‌కు దిగుతాడు. ఇద్ద‌రూ క‌ల‌బ‌డ‌తారు. ఆ ద్వేషం క‌మిష‌న‌ర్ కుమారుడు రాహుల్ మ‌న‌సులో ఉంటుంది. రామారావు మీద ప‌గ తీర్చుకోవ‌డం కోసం అత‌ని చివ‌రి ఛాన్స్ అయిన ఎస్ ఐ ఫిజిక‌ల్ ఎగ్జామ్‌కు వెళ్ల‌నీయ‌కుండా అడ్డుప‌డ‌తాడు. అయినా చివ‌రికి రామారావు ఎస్ ఐ అవుతాడు. ఈ క‌థ‌లో మ‌ధ్య‌లో అలెగ్జాండ‌ర్ (సాయిధ‌ర‌మ్‌తేజ్‌), అత‌ని ప్రేయ‌సి (ప్ర‌గ్యా జైశ్వాల్‌) కూడా ఉంటారు. వారిద్ద‌రు ఎవ‌రు? వారికీ రామారావుకు సంబంధం ఏంటి? క‌మిష‌న‌ర్ (ప్ర‌కాష్‌రాజ్‌), హోమ్ మినిస్ట‌ర్ (జె.డి.చ‌క్ర‌వ‌ర్తి) మంచివారా? చెడ్డ‌వారా? అలెగ్జాండ‌ర్‌, అత‌ని ప్రేయ‌సి ఏమ‌య్యారు? ముక్తార్ భాయ్ ఎవ‌రు? వంటివ‌న్నీ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్ల‌స్‌లు
పోలీసులంటే కృష్ణ‌వంశీకి గౌర‌వం. ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా బ‌త‌క‌డానికి పోలీస్ వ్య‌వ‌స్థ చేస్తున్న కృషిని ఆయ‌న ఇదివ‌ర‌కు సినిమాల్లోనే చెప్పారు ఈ సినిమాలో కూడా పోలీసుల గొప్ప‌త‌నాన్ని చూపించారు. సందీప్‌, సాయిధ‌రమ్‌తేజ్ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. త‌నీష్ న‌ట‌న చూశాక అత‌నికి కెరీర్‌లో కొత్త ట‌ర్నింగ్ పాయింట్ అనిపిస్తుంది. రెజీనా, ప్ర‌గ్యా జైశ్వాల్ గ్లామ‌ర్ స‌న్నివేశాల్లో ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌గ్యా ఫైట్లు కూడా ఆక‌ట్టుకుంటాయి. కెమెరాప‌నిత‌నం బావుంది. కృష్ణ‌వంశీ త‌ర‌హా టేకింగ్ సినిమాలో క‌నిపిస్తుంది. సినిమా ప‌రిశ్ర‌మ‌లోని పాత్ర‌ల‌ను అడ‌పాద‌డ‌పా త‌న సినిమాల్లో పెట్టే కృష్ణ‌వంశీ ఈ సినిమాలోనూ హీరోయిన్ రెజీనాను డ్యాన్స‌ర్‌గా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. శివాజీరాజా, తుల‌సి ఉన్నంత‌లో బాగా చేశారు.
మైన‌స్‌లు
క‌థ‌లో కొత్త‌ద‌నం ఉండ‌దు. `న‌క్ష‌త్రం` అనే టైటిల్‌.. అందులోనూ ముగ్గురు యువ హీరోలు, ఇద్ద‌రు హీరోయిన్లు.. ప్ర‌కాష్‌రాజ్‌, జె.డి.చ‌క్ర‌వ‌ర్తిలాంటి స్టార్ కాస్ట్ అన‌గానే చాలా ఎక్స్ పెక్టేష‌న్స్ ఉంటాయి. అయితే ఈ సినిమా ఆద్యంతం అంత‌గా ఎగ్జ‌యిట్ చేసే అంశం అంత‌గా క‌నిపించ‌దు. ఇంట్లో ఉన్న దొంగ‌ను ఈశ్వ‌రుడైనా ప‌ట్టుకోలేడ‌నే సామెతను కృష్ణ‌వంశీ న‌మ్మిన‌ట్టున్నారు. అందుకే త‌న కొడుకు డ్ర‌గ్స్ తీసుకుంటున్నా, బాంబుల డీల‌ర్‌షిప్ చేస్తున్నా క‌మిష‌న‌ర్ తెలుసుకోలేక‌పోయిన‌ట్టు చూపించారు. ఎలాంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా చేయ‌గ‌లిగే జె.డి.చక్ర‌వ‌ర్తికి ఇందులో స‌రైన పాత్ర ప‌డ‌లేదేమోన‌నిపిస్తుంది. పాట‌లు కూడా ఒక్క‌సారి విన‌గానే గుర్తుండిపోయేవి కావు. వైవా హ‌ర్ష పాత్ర‌ను పోలిన పాత్ర‌లు ఇంత‌కు ముందు తెలుగు సినిమాల్లో వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను మెప్పించేశాయి
రేటింగ్‌: 2.75/5
నిర్మాణ సంస్థ‌లుః శ్రీ చ‌క్ర మీడియా, బుట్ట బొమ్మ క్రియేష‌న్స్‌, విన్ విన్ విన్ క్రియేష‌న్స్‌
న‌టీన‌టులుః సాయిధ‌ర‌మ్ తేజ్‌, సందీప్ కిష‌న్‌, రెజీనా, ప్ర‌గ్యాజైశ్వాల్‌, ప్ర‌కాష్ రాజ్‌, త‌నీష్‌, మాన‌స్‌, శ్రియా, శివాజీరాజా త‌దిత‌రులు
ఎడిటింగ్ః శివ వై.ప్ర‌సాద్‌
సంగీతంః భీమ్స్‌, భ‌ర‌త్ మ‌ధుసూద‌న్‌, హ‌రి గౌర‌
నిర్మాత‌లుః కె.శ్రీనివాసులు, ఎస్‌.వేణుగోపాల్‌, స‌జ్జు
ద‌ర్శ‌క‌త్వంః కృష్ణ‌వంశీ
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *