ఆ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాం: కిమ్

అమెరికాతో పాటు పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యమున్న తన తొలి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం)ని మంగళవారం విజయవంతంగా పరీక్షించామని ప్రకటించిన ఉత్తరకొరియా.. పొరుగుదేశం దక్షిణ కొరియాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని ఢీకొనబోతున్న తమ దేశం దక్షిణకొరియాను ఏ మాత్రం లెక్క చేయదని, అవసరమైతే ముక్కలు ముక్కలుగా చేస్తుందని నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. ఈ విషయాలను దక్షిణకొరియా మీడియా వెల్లడించింది.

పూర్తి స్థాయి అణుశక్తి దేశమైన ఉత్తర కొరియా తమ వద్ద ఐసీబీఎం ఉందని, అమెరికా నుంచి పొంచి ఉన్న అణుయుద్ధ ముప్పును ఇది పరిష్కరిస్తుందని కిమ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్షిపణి అమెరికాలోని అలస్కాతో పాటు మరిన్ని ప్రాంతాలను సులువుగా చేరుకుని వినాశనం సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఖండాంతర క్షిపణి ప్రయోగం ఉద్దేశమేంటని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ప్రశ్నించగా.. నియంత కిమ్ జోంగ్ ఉన్ నుంచి ఊహించని సమాధానం వచ్చింది. మా ముందు తోలుబొమ్మల్లాంటి మీ సైన్యం ఏపాటిదని ప్రశ్నించారు. మీ సైన్యాన్ని ఓడించి దక్షిణకొరియాను ముక్కలు చేయడం మాకు చాలా తేలికైన పని అంటూ ప్యోంగ్ యాంగ్ ఓ ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు నార్త్ కొరియా క్షిపణి పరీక్షలపై అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉంది. అవరసరమైతే ఆ దేశంపై సైనిక చర్య తప్పదని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా రాయభారి నిక్కీ హేలీ హెచ్చరించారు. కిమ్ జీవితంలో చేయాల్సిన మంచి పనులే లేవా అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఈ విషయంలో తమతో చేతులు కలపాలని చైనాకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఉ.కొరియా ఈ ఏడాదిలో క్షిపణి పరీక్ష నిర్వహించడం 11వసారి కాగా, అమెరికా స్వాతంత్య్రదినమైన జూలై 4న ఐసీబీఎంను పరీక్షించడం తమ దేశాన్ని సవాల్ చేయడమేనని అమెరికా భావిస్తోంది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *