శశికళకు పన్నీర్‌ సెల్వం మాస్టర్‌ స్ట్రోక్‌!

నిన్నమొన్నటివరకు సౌమ్యుడిగా, పెద్దగా ఎత్తులు, పైఎత్తులు తెలియని అమాయక నేతగా ముద్రపడ్డ పన్నీర్‌ సెల్వం.. అసలైన సమయంలో తన రాజకీయ చాతుర్యాన్ని చాటుతున్నారు. ఎవరూ ఊహించని అంశాలను తెరపైకి తీసుకొచ్చి.. ప్రత్యర్థి వీకే శశికళను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా ఆయన సంధించిన ప్రశ్నాస్త్రాలు చిన్నమ్మ వర్గానికి ముచ్చెమటలు పట్టించేవే!

తనపై విషప్రయోగం చేశారన్న ఆరోపణలతో పోయెస్‌ గార్డెన్‌ నుంచి శశికళను జయలలిత వెళ్లగొట్టిన సంగతి తెలిసిందే. తిరిగి జయలలిత చెంతకు చేరేందుకు ఆమె నెచ్చెలి శశికళ క్షమాపణ చెప్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖను ఇప్పుడు బట్టబయలు చేసిన పన్నీర్‌ సెల్వం.. అందులోని అంశాల ఆధారంగా ఘాటైన ప్రశ్నాస్త్రాలను సంధించారు.

ఎందుకీ ఆశ?

జయకు రాసిన క్షమాపణ లేఖలో తనకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు లేవని, రాజకీయాలకు దూరంగా ఉంటానని శశికళ స్పష్టంగా చెప్పారని, ఇప్పుడెందుకు ఆమెకు కొత్తగా రాజకీయాలపై ఆసక్తి కలిగిందని సెల్వం నిలదీశారు. జయలలిత మృతి తర్వాత రాజకీయ పదవుల కోసం తహతహలాడటం పలు అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. జయలలిత 30 ఏళ్లు కష్టపడి నిర్మించిన రాజకీయ వారసత్వాన్ని ఎగరేసుకుపోయేందుకు శశికళ ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.

అమ్మకు ఇష్టంలేని కుటుంబాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?

శశికళ కుటుంబాన్ని జయలలిత అసలు ఇష్టపడేవారు కాదనే విషయం బహిరంగ రహస్యమే. తిరిగి తనను పోయెస్‌ గార్డెన్‌లోకి అనుమతించాలని అభ్యర్థిస్తూ జయలలితకు శశికళ రాసిన క్షమాపణ లేఖలో తన కుటుంబసభ్యులతో ఇక ఎలాంటి సంబంధాలు కొనసాగించబోనని శశి హామీ ఇచ్చారు. ఇప్పుడు జయలలిత మరణం తర్వాత ఆమె కుటుంబసభ్యులు అన్నాడీఎంకేలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పన్నీర్‌ సెల్వం​ సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు అమ్మలేని సమయంలో ఎందుకు  మీ కుటుంబంతో సన్నిహితంగా  ఎందుకు మెలుగుతున్నారని ప్రశ్నించారు.

జయలలితను తాను ఎన్నడూ మోసం​ చేయలేదని శశికళ పచ్చి అబద్ధం చేప్తున్నారని, ఆమెకు తమిళనాడు ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. సెల్వం సూటిగా, స్పష్టంగా సంధించిన ఈ ప్రశ్నాస్త్రాలు శశి వర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేవేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *