తమ్ముడి గురించి పచ్చి నిజాలు చెప్పిన రవితేజ

రవితేజ తమ్ముడు భరత్ రాజు చనిపోయిన రోజు మొదలుకొని ఇప్పటి దాకా వాళ్ళిద్దరి రిలేషన్ మీద వెబ్ మీడియా లో కథనాలు ఆగడం లేదు. కొన్ని వెబ్ సైట్స్ లో, యు ట్యూబ్ చానల్స్ లో హిట్స్ కోసం దారుణంగా కథలు అల్లడంతో అసలు ఏం జరిగింది అనే దాని గురించి అందరు అయోమయంలో ఉన్నారు. పైగా చివరి చూపు, అంత్యక్రియలకు రాకపోవడం పట్ల కూడా విమర్శలు రేగాయి. దాని తోడు మరుసటి రోజే రవితేజ రాజా ది గ్రేట్ షూటింగ్ కోసం వెళ్ళడంతో అవి పతాక స్థాయికి చేరుకున్నాయి. వీటి గురించి రవితేజ ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ లో పూర్తి క్లారిటీ ఇచ్చాడు.

ఇలా చెప్పడం తనకు ఇష్టం లేదని అయినా కొందరు దిగజారి మరీ తమ ఫ్యామిలీ గురించి రాస్తూ ఉండటం భరించలేక నోరు విప్పుతున్నానని చెప్పాడు. ఇప్పటి దాకా అందరిలో ఉన్న పలు సందేహాలకు ఇందులో సమాధానం దొరికేసింది. ఇకనైనా చనిపోయిన వాళ్ళకు గౌరవమిచ్చి ఇక్కడితో ఆపెయాలన్న ఆవేదన కూడా రవితేజ మాటల్లోనే వినిపించింది. మరి రవి ఏమన్నాడో ఆయన మాటల్లోనే

భరత్ రాజు నా స్వంత తమ్ముడు. పరాయివాడు కాదు. చివరి చూపుకు వెళ్ళలేదు అంటే చూసి తట్టుకునే స్థైర్యం లేకపోవడం వల్లే. నేను ఇండస్ట్రీలో ఎవరు చనిపోయిన చివరి చూపుకు వెళ్ళను. ఎందుకంటే చూసి తట్టుకోలేను. నేనెంతో అభిమానించే శ్రీహరి గారి భౌతికకాయాన్ని చూడడానికి బయలుదేరి ఆయన ఇంటి సమీపంలో వెనక్కు తిరిగి వచ్చేసాను. నన్ను మీరు ఎక్కడ చివరి చూపుల్లో చూడరు. తర్వాతే వాళ్ళ ఫ్యామిలీని వెళ్లి కలుస్తాను. అలాంటిది ఒకే రక్తం పంచుకు పుట్టిన నా తమ్ముడిని అలా చూడడానికి నాకు ధైర్యం ఉంటుందని ఎలా అనుకోమంటారు. మా నాన్న వయసు 85 ఏళ్ళు. బయటికి రావడం కష్టం. అమ్మకు నా కన్నా భరత్ అంటేనే ప్రాణం. వార్త వినగానే కుప్పకూలింది.

నా పిల్లలు కూడా భరత్ ను నాన్న అనే పిలుస్తారు. వాళ్ళను ఒదార్చలేక కూలబడ్డాను. ఇవేవి తెలుసుకోకుండా నిందలు వేసారు. అంత్యక్రియలు జరిపించింది జూనియర్ ఆర్టిస్ట్ కాదు. నా బాబాయ్. అమ్మకు స్వయానా సోదరి భర్త. ఎవరితోనో చేయించాల్సిన ఖర్మ మాకు పట్టలేదు. చిన్న తమ్ముడు రఘు అక్కడే ఉన్నాడు. శాస్త్ర ప్రకారం చేయకూడదు అన్నందుకు వద్దు అన్నాం. నాన్న చేయాలి. ఆ రోజు నాన్నను అక్కడికి తీసుకువస్తే పరిస్థితి ఏమవుతుందో నాకు తెలుసు కాబట్టే రాకుండా ఆగిపోయాను. ఇంత నరకాన్ని నేను అనుభవిస్తే రవితేజ ఇలాంటివాడా అని కథలు రాసుకుని మీఇష్టం వచ్చినట్టు చేసారు అని ఆవేదన వ్యక్తపరిచారు.

షూటింగ్ కాగానే స్నేహితులతో టైం స్పెండ్ చేసే తను అమ్మ నాన్న కోసం అవన్నీ మానుకుని ఇంటికి వచ్చేస్తున్నా అని అన్నాడు. భరత్ మా కళ్ళల్లో సజీవంగానే ఉన్నాడని, దారి తప్పి ఉండవచ్చు కాని దుర్మార్గుడు కాదని, సున్నితమైన మనసు కాబట్టే ఇంత ప్రేమను ఇంట్లో పొందగలిగాడు అని రవితేజ చెప్పాడు. ఇకనైనా రవితేజ పైన కథల పరంపరకు తెరదించుతారు అనే కోరుకుందాం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *