రివ్యూ: అమ్మ ప్రేమకు ప్రతిరూపం “మామ్ “

శ్రీదేవి..ద‌క్షిణాదినే కాదు, ఉత్త‌రాది చ‌ల‌న చిత్ర రంగంలో కూడా సూప‌ర్‌స్టార్ స్టేట‌స్‌తో రాణించిన తొలి హీరోయిన్‌. ఐదు ప‌దుల న‌ట‌నానుభ‌వంతో పాటు న‌టిగా మూడు వంద‌ల సినిమాలు చేయ‌డమంటే చిన్న విష‌యం కాదు. పెళ్ళైన త‌ర్వాత చాలా కాలం సినిమాల‌కు దూర‌మైన శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్‌తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. త‌ర్వాత వెంట‌నే సినిమాలు అంగీక‌రించ‌కుండా సెల‌క్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. అలా సెల‌క్టివ్‌గా శ్రీదేవి న‌టించిన చిత్రం `మామ్‌`. యుక్త‌వ‌య‌సులోని ఓ కూతురికి, అమ్మ‌కు మ‌ధ్య ఎలాంటి సంఘ‌ర్ష‌ణ ఉంటుందనే విషయాన్ని చ‌క్క‌గా చూపించారు. దీంతో పాటు త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ఓ త‌ల్లి ఎలా ఎదురుతిరిగింద‌నేదే తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం…
క‌థః
దేవకి(శ్రీదేవి) ఓ ప్రైవేట్ క‌ళాశాలో బోట‌నీ లెక్చ‌ర‌ర్‌. ఆనంద్ స‌బ‌ర్వాల్(అద్‌నాన్ సిద్ధిఖీ)ని దేవ‌కి రెండో పెళ్ళి చేసుకుంటుంది. అప్ప‌టికే ఆనంద్‌కు ఆర్య‌( స‌జ‌ల్ సిద్ధిఖీ) పాప ఉంటుంది. దేవ‌కి ఆర్య‌ను త‌న కూతురిగా అంగీక‌రించినా, ఆర్య మాత్రం దేవ‌కి త‌న త‌ల్లి స్థానంలో అంగీక‌రించ‌దు. ఆర్య పెరిగి పెద్ద‌ద‌వుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య దూరం అలాగే ఉండిపోతుంది. ఓసారి ఆర్య వేలంటెన్స్ డే పార్టీకి వెళుతుంది. కానీ తిరిగి వ‌చ్చే స‌మ‌యంలో ఓ న‌లుగురు ఆర్య‌ను కార్‌లో రేప్ చేస్తారు. ఆ ఘ‌ట‌న‌లో దేవ‌కి కుటుంబం చాలా ఇబ్బందులు ప‌డుతుంది. కోర్టుకు వెళ్ళినా స‌రైనా సాక్ష్యాలు దొర‌క‌లేద‌ని నేర‌స్థుల‌ను విడిచి పెట్టేస్తారు. అప్పుడు దేవ‌కి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? ఆర్య‌, దేవ‌కి మ‌ధ్య దూరం త‌గ్గిపోతుందా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేష‌ణః
దేవ‌కి పాత్ర‌లో శ్రీదేవి అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌ప‌రిచారు. కూతురి కోసం ఆరాట‌ప‌డే త‌ల్లి పాత్ర‌లో ఒదిగిపోయారు. కూతురికి అన్యాయం జ‌రిగిన‌ప్పుడు శ్రీదేవి ఏడ్చే స‌న్నివేశాలు, ఓ యాక్సిడెంట్ జ‌రిగిన సంద‌ర్భంలో, క్లైమాక్స్‌లో విల‌న్‌తో మాట్లాడేప్ప‌డు శ్రీదేవి హావ‌భావాలు చూస్తే ఆమె త‌ప్ప ఈ పాత్ర‌ను మ‌రెవ‌రూ చేయ‌లేర‌నిపిస్తుంది. ఇక అద్‌నాన్ సిద్ధిఖీ త‌న పాత్ర ప‌రంగా చ‌క్క‌గా న‌టించాడు. యుక్త‌వ‌య‌సురాలైన అమ్మాయి పాత్ర‌లో స‌జ‌ల్ అలీ చ‌క్క‌గా న‌టించింది. న‌వాజుద్దీన్ సిద్ధిఖీ స‌హా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. సినిమా మొత్తంగా చూస్తే క‌థ‌లో ట్విస్టులు, ట‌ర్నింగ్ పాయింట్‌లు ఏమీ క‌న‌ప‌డ‌వు. సినిమా స్టార్ట‌యిన ఇర‌వై నిమిషాల‌కు క‌థేంటో మ‌న‌కు తెలిసిపోతుంది. కానీ అక్క‌డ నుండి క‌థ సాగే విధానంను ద‌ర్శ‌కుడు క్యారీ చేసిన విధానం, ఆ క‌థ‌కు న‌టీనటులు, సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ ఎలా తోడ‌య్యార‌నేదే చూడాలంతే.

ఇక టెక్నిషియ‌న్స్ విష‌యానికి వ‌స్తే అనే గోస్వామి సినిమాటోగ్ర‌ఫీ సింప్లీ సూప‌ర్బ్‌. ఇక సంగీతం విష‌యానికి వ‌స్తే, రెహ‌మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం. పాట‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం క‌న‌ప‌డ‌దు. ఎడిటింగ్ ఓకే. సెకండాఫ్ కాస్తా లెంగ్తీగా అనిపించింది. సినిమా స్లోగా న‌డుస్తుంది. సినిమాలో ఎమోష‌న్స్ త‌ప్ప చెప్పుకోతగ్గ బ‌ల‌మైన అంశం క‌న‌ప‌డదు. ఓ త‌ల్లి త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ఎలా స్పందించ‌ద‌నే పాయింట్ సెకండాఫ్‌లో ప్రేక్ష‌కుడికి తెలిసిపోతుంది. దృశ్యం త‌ర‌హా చాలా సినిమాలను ప్రేక్ష‌కుడు చూసేశాడు మ‌రి. ఎంట‌ర్‌టైన్మెంట్‌ను కోరుకునే ప్రేక్ష‌కుడికి సినిమా పెద్ద‌గా న‌చ్చ‌దు. సినిమాలో కొత్త‌గా చెప్పిందేం లేదు.

రేటింగ్ః 2.75/5
బ్యాన‌ర్ః
మ్యాడ్ ఐ ఫిలింస్‌, థ‌ర్డ్ ఐ పిక్చ‌ర్స్‌
న‌టీన‌టులుః శ్రీదేవి, అద్‌నాన్ సిద్ధిఖీ, స‌జ‌ల్ అలీ, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, అభిమ‌న్యు సింగ్ త‌దిత‌రులు
సంగీతంః ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
సినిమాటోగ్ర‌ఫీః అనే గోస్వామి
ఎడిటింగ్ః మోనిషా ఆర్‌.బ్లాద్వా
నిర్మాత‌లుః బోనీ క‌పూర్‌, సునీల్ మాన్‌చంద్ర‌, న‌రేష్ అగ‌ర్వాల్‌, గౌత‌మ్ జైన్‌, ముకేష్‌
ద‌ర్శ‌కత్వంః ర‌వి ఉద్య‌వ‌ర్‌
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *