బలపరీక్ష నెగ్గిన సీఎం పళనిస్వామి….

తమిళనాడులో అసెంబ్లీలో హైడ్రామా మధ్య పళనిస్వామి విశ్వాస పరీక్ష నెగ్గారు. ఆయన బలపరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ధన్‌పాల్ ప్రకటించారు. డీఎంకే ఎమ్మెల్యేలు నిరసనకు దిగడంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయమే పళని స్వామికి కలిసొచ్చింది. డీఎంకే ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో పళని విశ్వాస పరీక్ష నెగ్గడం సులభతరమైంది.

ప్రతిపక్ష పార్టీ డీఎంకేలో 89 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరెవరు ఓటింగ్‌లో పాల్గొనలేదు. పళనికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. కాంగ్రెస్ తరపున ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌ను బహిష్కరించారు. పన్నీర్ తరపున మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో ఆయన నెగ్గుకురాలేకపోయారు. పళనికి వ్యతిరేకంగా ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఓటేసినట్లు తెలుస్తోంది.

బలపరీక్ష కంటే ముందు సభ రెండుసార్లు వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన అసెంబ్లీలో రచ్చ కొనసాగింది. డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. దాంతో సభ మూడు గంటల వరకు వాయిదా వేశారు. సభా మర్యాదను మంటగలిపేలా సభ్యులు ప్రవర్తించారని స్పీకర్ ధన్ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిన ఆయన, వారిని వెంటనే సభ నుంచి బయటకు పంపించాలని ఆదేశించారు. అయితే సభ్యులను బయటకు పంపేందుకు ప్రయత్నించిన మార్షల్స్ పై కూడా డీఎంకే ఎమ్మెల్యేలు దాడికి ప్రయత్నించారు.

రహస్య ఓటింగ్ కు పట్టుబడుతూ డీఎంకే, కాంగ్రెస్, పన్నీర్ సెల్వం వర్గాలు బీభత్సం సృష్టించాయి. మైకులు, కుర్చీలు విరగగొట్టి సభ్యులు ఆందోళన చేశారు. అంతేకాకుండా పలువురు ఎమ్మెల్యేలు బెంచీలపై ఎక్కి, బీభత్సం సృష్టించారు. డీఎంకే ఎమ్మెల్యే కుకా సెల్వం స్పీకర్ కుర్చీలో కూర్చొని నిరసన తెలిపారు. మరోవైపు మహిళా ఎమ్మెల్యే అలాడి అరుణ కుర్చి ఎక్కి నిరసన తెలిపారు. ఓటింగ్ కు అందరూ సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు వినలేదు. ఎమ్మెల్యేల బీభత్సంలో అసెంబ్లీ సిబ్బంది గాయపడ్డారు. దాంతో వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడంతో పాటూ, తలుపులు కూడా మూసివేశారు. దీంతో లోపల ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు మీడియాను అనుమతించలేదు. కనీసం లోపలి ఆడియో కూడా వినిబడకుండా కట్‌ చేశారు. దాని తర్వాత స్పీకర్ ధన్ పాల్ బలపరీక్షలో పళనిస్వామి నెగ్గినట్లు ప్రకటించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *