పన్నీర్ సెల్వంతో ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు మరో సమస్య వచ్చిపడింది.  అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ దెబ్బకు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన ఆయన ఇప్పుడు ఉన్నఫళంగా తన ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.  సీఎం పదవి కోల్పోవడంతో… ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆయనకు ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పళని స్వామి ప్రభుత్వ తాజా ఆదేశాలతో పన్నీర్ ఇప్పుడు అద్దె ఇంటి కోసం వెతుకుతున్నారట. 2011లో అన్నాడీఎంకే గెలుపొందిన తర్వాత పన్నీర్ సెల్వం ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అప్పుడు ఆయనకు చెన్నైలోని గ్రీన్ వేస్ రోడ్డులో ఉన్న పీడబ్ల్యూడీకి చెందిన బంగ్లాను కేటాయించారు. జయలలిత జైలుకు వెళ్లిన తర్వాత పన్నీర్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కూడా ఆయన ఆ బంగ్లా మారకుండా అదే ఇంట్లో ఉంటున్నారు. తాజాగా పదవిని కోల్పోవడంతో బంగ్లాను ఖాళీ చేయాలని ఆయనకు ఆదేశాలు జారీ అయ్యారు.

నిజానికి పన్నీర్ ఇప్పుడు సీఎం కాకపోయినా  జనాల్లో మాత్రం పన్నీర్ సెల్వంకు క్రేజ్ బాగానే ఉంది. ప్రతి రోజు ఆయనను కలవడానికి భారీ సంఖ్యలో అన్నాడీఎంకే కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో పీడబ్ల్యూడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. బంగ్లాను ఖాళీ చేయడానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని పన్నీర్ వర్గీయులు కోరుతున్నారు. అయినప్పటికీ ఆ నివాసాన్ని ఖాళీ చేయాలనే నిర్ణయానికి పన్నీర్ వచ్చేశారని తెలుస్తోంది. పెద్ద బంగ్లా ఏదైనా దొరికితే వీలైనంత తొందరగా మారిపోవాలని ఆయన ఆలోచిస్తున్నారట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *