బన్నీ రిస్క్ చేస్తున్నాడా?

వక్కంతం వంశీ. ఓ పదేళ్ళ క్రితం ఈ పేరు పెద్ద పాపులర్ కాదు. నటుడిగా ఎన్నో ట్రైల్స్ వేసి వర్క్ అవుట్ కాక చివరికి రైటర్ గా మారి అందులోనే బంగారు భవిష్యత్తు వెతుకున్న ఒక టాలెంట్ కున్న పేరు. దాసరి నారాయణ రావు ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాతో తెరంగేట్రం చేసిన వక్కంతం వంశీ అనే కుర్రాడు తర్వాత అడపాదడపా చిన్న చిన్న సినిమాల్లో వేషాలు వేసినప్పటికీ తను కలగన్న హీరో రేంజ్ కు మాత్రం చేరుకోలేకపోయాడు. తర్వాత రచన వైపు మళ్ళిన వక్కంతం అందులో మాత్రం తాను ఊహించిన దాని కంటే మంచి సక్సెస్ ను అందుకున్నాడు. సురేందర్ రెడ్డి సినిమాలతో లైం లైట్ లోకి వచ్చిన వంశీ గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్, పూరి కాంబో లో వచ్చిన ‘టెంపర్’ సినిమాకు కథను ఇవ్వడంతో సంచలనం రేపాడు. తన కథలతో తప్ప బయటివాళ్ళను ఒప్పుకోని పూరి జగన్నాధ్ మొదటిసారి ఇతర రైటర్ తో వర్క్ చేసాడు అంటే అది ఈ ఒక్క సందర్భంలోనే. తారక్ తో మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉన్న వంశీ తను డైరెక్టర్ గా ఓనమాలు దిద్దబోయే మొదటి సినిమా తారక్ తోనే చేయాలని ఎంతో ట్రై చేసాడు. దానికి కథను కూడా సిద్ధం చేసుకుని ఆల్మోస్ట్ ఎన్టీఆర్ ను ఒప్పించాడు కూడా. కాని ‘జనతా గ్యారేజ్’ హిట్ తర్వాత తన కెరీర్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేని తారక్ సున్నితంగా దాన్ని తిరస్కరించాడు.

ఇప్పుడు వక్కంతం వంశీ బూరెల బుట్టలో పడ్డాడు. మరి అదే కథనో ఫ్రెష్ గా మరో కథనో తెలియదు కాని బన్నీ ఇప్పుడు వంశీతో చేయడానికి ఓకే చెప్పాడని టాక్. లగడపాటి శ్రీధర్ నిర్మాతగా వ్యవహరించే ఈ మూవీకి మెగా బ్రదర్ నాగబాబు మరో నిర్మాత. ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాధం’ షూటింగ్ లో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ దాని తర్వాత లింగుస్వామితో ద్విబాష చిత్రం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాతే ఈ మూవీ ఉంటుంది. ఒకవేళ ఇది పట్టాలెక్కితే వంశీ దశ తిరిగినట్టే. ఎన్టీఆర్ ఇమేజ్ తో సరితూగగల బన్నీతో సినిమా చేస్తే టోటల్ మెగా ఫాన్స్ అండ్ ఫ్యామిలీ దృష్టిలో పడొచ్చు. సినిమా హిట్ అయితే చాలు వెనక్కు తిరిగి చూసుకునే అవసరం పడదు. కోటి రూపాయల కథకుడిగా పేరు తెచ్చుకున్న వంశీ డైరెక్టర్ గా మారాలి అనుకోవడంలో రైటర్ గా తనకు రావాల్సిన స్థాయిలో పేరు రావడం లేదనే ఆవేదనే అని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. మరి టైం వచ్చేసింది కాబట్టి ఓ కొత్త క్రేజీ కాంబినేషన్ కి శ్రీకారం చుట్టినట్టే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *