శ్రీనివాస్‌ది జాత్యహంకార హత్యే: ట్రంప్

అమెరికాలోని కేన్సస్‌లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ఎట్టకేలకు స్పందించారు. శ్రీనివాస్‌ది జాత్యహంకార హత్యేనని తెలిపారు. అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన 40 రోజుల తర్వాత తొలిసారిగా అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. శ్రీనివాస్ హత్యను ఖండించారు. దేశంలో ఇటువంటి దాడులకు చోటు లేదని స్పష్టం చేశారు.  అమెరికా పౌరులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రపంచంలో అమెరికాను అగ్రస్థానంలో కొనసాగించాలన్నారు.

తాను అధికారంలోకి రాగానే అమెరికాకు కంపెనీలు తిరిగి వస్తున్నాయని తెలిపారు. నెలరోజుల్లో అద్భుతంగా పనిచేశామన్నారు. స్టాక్‌మార్కెట్లు పుంజుకున్నట్లు, బొగ్గు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు, ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. దేశ సరిహద్దులను బలోపేతం చేస్తామన్న ట్రంప్ అమెరికా-మెక్సికో మధ్య గోడ కట్టితీరుతామని స్పష్టం చేశారు. త్వరలోనే గోడ నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. విద్వేష దాడులకు అమెరికాలో చోటులేదని పేర్కొన్నారు.

అమెరికన్ల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వారికి ఉద్యోగాలు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోనే అద్భుతమైన మార్పులు తీసుకొచ్చినట్టు చెప్పారు. కంపెనీలు వెనక్కి వస్తున్నాయని పేర్కొన్న ట్రంప్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శలు చేశారు. ఆయన హయాంలో దేశంలో ఉగ్రదాడులు పెరిగాయని ఆరోపించారు. దేశంలో డ్రగ్స్‌ను అరికడతామని హామీ ఇచ్చారు.

ఇటీవల కేన్సస్‌లోని ఓ బార్‌లో శ్వేత జాతీయుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ ప్రాణాలు కోల్పోగా.. మరో తెలుగు యువకుడు అలోక్‌రెడ్డి, దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇయాన్‌ గ్రిలాట్‌ అనే అమెరికన్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఇది జాత్యహంకార హత్యేనని అన్ని వర్గాలు ఆరోపిస్తున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించలేదు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్‌ వైఖరి విద్వేష ఘటనలు జరిగేందుకు వూతమిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తడంతో చివరకు ఆయన స్పందించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *