హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన ఎగిరే పాము!

భాగ్యనగరంలో తొలిసారి ఎగిరేపాము దర్శనమిచ్చి కలకలం రేపింది. జనసంచారంతో నిత్యం రద్దీగా ఉండే గోషామహల్ ప్రాంతంలో ఇది కనిపించడం మరింత భయాందోళనకు గురిచేసింది. అత్యంత అరుదుగా కనిపించే ఈ పాములను ఓర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ లేదా క్రిసోఫిలియా ఓర్నటా అని పిలుస్తారు. రోలింగ్ షట్టర్ కింద దాక్కున్న ఈ పామును ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ’ వారు పట్టుకుని సైనిక్‌పురిలోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. విషపూరితమైన ఈ పాము ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటివరకు కనిపించలేదని వారు వెల్లడించారు.
సాధారణంగా ఎగిరేపాములు పశ్చిమ కనుమలు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఘటనా స్థలానికి చుట్టుపక్కల అనేక టింబర్ డిపోలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి కలప, ప్లైవుడ్ తరలించే క్రమంలో వాటితో పాటు అనుకోకుండా పాము వచ్చి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ జాయింట్ సెక్రటరీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘గోషామహల్‌లోని ఓ షాపు యజమాని మాకు ఫోన్ చేసి సాయం కోరారు. తన ప్లేవుడ్ షాపు ప్రవేశ ద్వారం వద్ద చిన్న పాము కనిపించిందని చెప్పారు.. దీంతో కొందరు టీమ్ సభ్యులు అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నారు’’ అని వెల్లడించారు.
మన దేశంలో లభ్యమయ్యే మూడురకాల ఎగిరే పాముల్లో ఓర్నేట్ ఫ్లయింగ్ స్నేక్స్ ఒకటి. ఈ సర్పాలు తమ శరీరాన్ని బల్లపరుపుగా పెట్టి గాల్లో ఎగరుతూ ప్రయాణించగలవు. ఆ సమయంలో తమశరీరాన్ని మామూలు వెడల్పుకంటే రెండు రెట్లు పెద్దగా చేసుకుంటాయి. గాలిలో పట్టుకోసం శరీరాన్ని పుటాకారంలో ఒంపుతిప్పుకుంటాయి. చెట్లపై ఓ కొమ్మ నుంచి మరో కొమ్మపైకి అత్యంత సులభంగా ఎగురుతాయి.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *