ఖైరతాబాద్ వినాయకుడి ఘనత..

వినాయక చవతి వచ్చిందంటే తెలుగువారకి మొదటగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో ఖైరతాబాద్ గణపతి దర్శనమిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖైరతాబాద్ వినాయకుడు మరో ఘనత సాధించాడు. దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా అరుదైన గుర్తింపు సాధించింది. ఈ ఏడాది 61 అడుగుల ఎత్తులో ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో భారీ గణపతి రూపుదిద్దుకున్నాడు. వినాయ‌కుడి కుడి వైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి.. ఎడమ వైపున బ్రహ్మా, విష్ణు, మహేశ సమేత దుర్గాదేవి కొలువదీరారు. ఒక్కో తలకు ఒక్కో రకమైన రంగుతో గ‌ణ‌నాథుడు రూపుదిద్దుకున్నాడు. ఈ రూపంలో వినాయకుణ్ని పూజిస్తే సకాలంలో వర్షాలు పడి, అందరికీ మంచి జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. విగ్రహం రూకల్పనకు 150 మంది నాలుగు నెలలపాటు శ్రమించారు. మొత్తం రూ.కోటి ఖర్చుచేశారు. ఈ ఏడాది విగ్రహ తయారీ అనుకున్న సమయంలోనే పూర్తయిందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 టన్నులు బరువుండే మహాగణపతికి సెప్టెంబరు 2న వినాయక చవితి రోజున తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తొలి పూజ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ 11 రోజుల పాటు ఖైరతాబాద్‌ గణేశుని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *