ఆరు నెలలుగా మాటల్లేవ్‌!: కోహ్లీ-కుంబ్లేల మధ్య అనుష్క ప్రస్తావన వచ్చిందా?

టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య గత ఆరు నెలలుగా మాటలు లేవని తెలిసి బీసీసీఐ కూడా షాక్‌కు గురైంది. బీసీసీఐ వర్గాల ప్రకారం.. డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత ఈ ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. అప్పట్నించే వీరిద్దరూ పరస్పరం మాట్లాడుకోవడం మానేశారు. అంతేకాదు వెస్టిండిస్ పర్యటనకు కుంబ్లేని కొనసాగించాలనుకోవడం వెనుక కూడా హైడ్రామా నడిచింది. లండన్‌లో జరిగిన ఈ మొత్తం ఎపిసోడ్‌ను దగ్గర్నించి చూసిన బీసీసీఐ అధికారి ఒకరు కెప్టెన్, కోచ్ మధ్య విభేదాలపై స్పందించారు. నిజానికి సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ కుంబ్లే కొనసాగింపునకు నేరుగా ఏమీ ఒప్పుకోలేదని, షరతులతో మాత్రమే పొడిగింపునకు అంగీకరించిందని అన్నారు.

విండిస్ పర్యటన వరకు కుంబ్లే కొనసాగిస్తే ఎలా ఉంటుందని బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీని అడిగింది. కానీ అప్పటికే కోహ్లీ, కుంబ్లేల మధ్య వ్యవహారాన్ని పూర్తిగా తెలుసుకున్న సీఏసీ దీనికి నేరుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కొన్ని షరతులు సూచిస్తూ ఓకే చెప్పింది. ముందుగా ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది.

ఆ తర్వాత కలిసి పని చేస్తామని ఇద్దరూ నిర్ధారణకు వచ్చిన తర్వాతే పొడిగింపు ఇవ్వాలని చెప్పింది. ‘సీఏసీ కుంబ్లే కొనసాగింపునకు ఒప్పుకుందని వార్తలు వచ్చాయి. అది నిజమే కానీ.. కొనసాగించాలంటే కుంబ్లే ఇప్పుడున్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలని కమిటీ స్పష్టం చేసింది’ అని లండన్‌లోనే ఉన్న ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారి చెప్పాడు.

తొలి సమావేశంలో కుంబ్లే.. బీసీసీఐ ఉన్నతాధికారులు, సీఏసీ సభ్యులను కలుసుకున్నాడు. చర్చల సందర్భంగా విరాట్‌తో తనకు ఎలాంటి సమస్య లేదని అనిల్ పదేపదే చెప్పాడు. తన కోచింగ్‌పై కోహ్లీకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, ఇవి పెద్ద సమస్యలు కావని తేల్చాడు. ఆ తర్వాత కోహ్లీ వారిని కలిశాడు. ఇక మూడో సమావేశంలో కుంబ్లే, కోహ్లీలను టేబుల్‌కు ఎదురెదురుగా కూర్చోపెట్టారు. ఏదైనా సమస్య ఉందా? అని అడిగినప్పుడు ఇద్దరూ భిన్న సమాధానాలిచ్చారు. కోహ్లీతో తనకేమీ ఇబ్బంది లేదని కుంబ్లే చెప్పాడని బోర్డు అధికారి తెలిపాడు.

అయితే అతడి పనితీరుపై కోహ్లీ అభ్యంతరాల గురించి చెప్పినప్పుడు ‘అవి సమస్యలే కావు’ అని కుంబ్లే చెప్పాడట. కానీ ఇద్దరూ మెట్టు దిగకపోవడం, వీళ్ల మధ్య అసలు మాటలు లేవని విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చివరకు తాము కలిసి కొనసాగడం కష్టమని కోచ్, కెప్టెన్ ఓ అభిప్రాయానికి రావడంతో బోర్డు కూడా చేతులెత్తేసింది. ‘కోహ్లీ, కుంబ్లే మాట్లాడుకోవట్లేదు. కొన్ని సమస్యలున్నాయని తెలుసు. కానీ ఆరునెలలుగా మాట్లాడుకోవట్లేదని తెలిసి దిగ్భ్రాంతి చెందాం. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత వారిని ఎదురు ఎదురుగా కూర్చోపెట్టాం. ఇద్దరూ కలిసి పనిచేయడం కుదరదు’ అని తేల్చి చెప్పారని అధికారి వివరించాడు.

కోచింగ్ పరంగా కఠినంగా ఉండే కుంబ్లే కొన్నిసార్లు హద్దులు మీరి వ్యక్తిగత అంశాల్లోకి వస్తున్నాడని కోహ్లీ భావించినట్లు మరో అధికారి వెల్లడించారు. కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మతో గత కొన్నాళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఈ విషయంపై ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది. ఇవి క్రికెటేతర అంశాలు కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పరిష్కరించలేనంతగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తన వ్యక్తిగత విషయాల్లోకి కుంబ్లే వస్తున్నాడని కోహ్లీ అహం దెబ్బతింది. కుంబ్లే గొప్ప ఆటగాడు. అతని నమ్మకాలు ఆలోచనలు వేరేగా ఉంటాయి. కానీ మైదానంలో తుది నిర్ణయం మాత్రం కెప్టెన్‌కే ఉంటుంది కదా. దీనిని ఇద్దరూ అర్థం చేసుకోలేకపోయారు’ అని బీసీసీఐ అధికారి తెలిపాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *