చరిత్ర సృష్టించిన ఇస్రో : 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ-సీ37

నెల్లూరు: శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ37 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. బుధవారం ఉదయం 9.28నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ37లోకి 104 ఉపగ్రహాలను తీసుకెళుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంతో 104 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది ఇస్రో. ప్రపంచంలో తొలిసారి ఇలాంటి చరిత్రాత్మక ప్రయోగానికి ఇస్రో తెరతీసింది.

పీఎస్ఎల్వీ-సీ37 మొత్తం 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యావర్తన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. 28.42 నిమిషాల్లో రాకెట్‌ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రయోగం ప్రారంభమైన తర్వాత 17.29 నిమిషాలకు కార్టోశాట్‌-2.. రాకెట్‌ నుంచి 510.383 కిలోమీటర్ల ఎత్తులో విడిపోయాయి. ఐఎన్‌ఎస్‌-1ఏ 17.29 నిమిషాలకు, ఐఎన్‌ఎస్‌-1బి 17.40 నిమిషాలకు వాహక నౌక నుంచి విడిపోయాయి. దీని తర్వాత 18.32 నిమిషాల నుంచి 28.42 నిమిషాల మధ్య విదేశీ ఉపగ్రహాలన్నీ 524 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్‌ నుంచి విడిపోయాయి.

104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. శాస్త్రవేత్తల బృందానికి ఇస్రో ఛైర్మన్ అభినందనలు తెలిపారు. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కానిది.. ఇస్రో సాధించింది ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే ఇస్రో నూతన అధ్యాయానికి తెరలేపింది. ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను ఒకే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపింది. 104 ఉపగ్రహాల్లో అమెరికాకు చెందినవే 96 ఉన్నాయి.

ఇందులో డవు ఉపగ్రహాలు 88, లెమర్‌ ఉపగ్రహాలు 8. మిగిలిన వాటిలో ఇజ్రాయిల్‌, కజకిస్థాన్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం, మన దేశానికి చెందినవి మూడు ఉపగ్రహాలు ఉన్నాయి. మన దేశానికి చెందిన మూడు ఉపగ్రహాల్లో కార్టోశాట్‌-2 714 కిలోలు, ఐఎన్‌ఎస్‌ 1ఎ, ఐఎన్‌ఎస్‌ 1బి ఉపగ్రహాలు ఒక్కోటి 14 కిలోల బరువున్నాయి. మిగలిన ఉపగ్రహాల బరువు 834 కిలోలు.

104ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో రష్యా, అమెకాలను ఇస్రో వెనక్కి నెట్టింది. అత్యధిక ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి ఏకైక దేశంగా భారత్ అవతరించింది. కాగా, ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ అభినందనలు తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *