రివ్యూ: సీక్రెట్ సూపర్‌స్టార్… 5/5 రేటింగ్ ఇచ్చే సినిమా

ప్రేక్షకులకు ముక్కు ముఖం తెలియని నటీనటులతో అద్భుతమైన సినిమాలు తీయడం బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకు సాక్ష్యంగా తారే జమీన్ పర్, పీప్లీ లైవ్, దంగల్ చిత్రాలు నిలిచాయి. అదే కోవలో ఎలాంటి హడావిడి ప్రచార ఆర్భాటం లేకుండా అక్టోబర్ 19న విడుదలైన చిత్రం సీక్రెట్ సూపర్‌స్టార్.

భారతీయ సినిమా ప్రపంచంలో ఈ చిత్రాన్ని అత్యున్నత శిఖరంపైన నిలబెట్టడానికి సీక్రెట్ సూపర్‌స్టార్లుగా మారిన వారిలో అమీర్ ఖాన్‌నే కాకుండా వసీమ్ జైరా (దంగల్ ఫేం), ఆమె తల్లిదండ్రులుగా నటించిన మెహర్, రాజ్ అర్జున్, దర్శకుడు అద్వైత్ చందన్ ఉన్నారు. ఇండియన్ సినిమా కమర్షియల్, మసాలా ఫార్ములా అడ్డంకులను చీల్చుకుంటూ బయటకు వచ్చిన భావోద్వేగ చిత్రం సీక్రెట్ సూపర్‌స్టార్.

సీక్రెట్ సూపర్‌స్టార్‌ చిత్రంలో పాపులారిటీ ఉన్న నటీనటులు కనిపించరు. బాహుబలి చిత్రంలా గ్రాఫిక్స్ ఉండవు. స్పైడర్ సినిమా మాదిరిగా భారీ బడ్జెట్ చిత్రం కాదు. పాపులారిటీ ఉన్న విలన్ కనిపించడు. కేవలం కథ, కథనం, ఎమోషనల్ సన్నివేశాలు, పాత్రధారుల అద్భుతమైన నటన ఈ సినిమాకు స్టార్ స్టామినా. సినిమా చూస్తున్నంత సేపు కొన్ని పాత్రలను ప్రేమిస్తాం. మరో కొన్ని పాత్రలను ద్వేషిస్తాం. పాత్రలతోపాటు కన్నీరు పెట్టుకొంటాం. నవ్వుతాం. సినిమాలో లీనం అవుతాము. కథలో కుటుంబ సభ్యుడిగా భాగమైపోతాం. అంతటి గొప్ప సినిమాగా రూపొందిన సీక్రెట్ సూపర్‌స్టార్ కథ గురించి నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం..

బరోడా ముస్లిం అమ్మాయి కథగా.. గుజరాత్‌లోని బరోడాలో ఎనిమిదో తరగతి చదువుకునే ముస్లిం అమ్మాయి ఇన్సియా (జైరా వసీం)కు జీవితంలో ఓ గొప్పగా సింగర్ కావాలనే కల ఉంటుంది. తన కల వెనుక మత పరమైన అడ్డంకులు ఉంటాయి. ఆ అమ్మాయి కలను గెలిపించడానికి తల్లి నజ్మా ( మెహర్)విశేష పోరాటం ఉంటుంది. ఓ నాలుగేళ్ల తమ్ముడి (కబీర్) ఆరాటం ఉంటుంది. అమ్మాయి కలను సాకారం చేసేందుకు ఓ పదిహేను ఏళ్ల ప్రేమికుడు (చింతన్) అహర్నిశలు ప్రయత్నిస్తుంటాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మరో వైపు ఆ అమ్మాయి కలను చిధ్రం చేయడానికి విలన్ రూపంలో తండ్రి (రాజ్ అర్జున్) ప్రయత్నిస్తుంటాడు. మధ్య తరగతిలో ఉండే ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తాయి. ఇలాంటి పాత్రల మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణకు వెండి తెర రూపమే సీక్రెట్ సూపర్‌స్టార్.

మధ్య తరగతికి సాక్ష్యంగా భర్త గృహ హింసకు గురయ్యే ఓ తల్లి (మెహర్) పాత్రతో సినిమా ప్రారంభమవుతుంది. స్కూల్ టూర్‌కు వెళ్లి వచ్చిన కూతురును స్టేషన్‌లో రిసీవ్ చేసుకోవడానికి వెళ్లిన తల్లి బలమైన దెబ్బ కారణంగా కన్ను కమిలిపోయి ఉండటం చూసి బాధపడటం మొదలవుతుంది. ఓ మధ్య తరగతి కుటుంబంలో ఉండే ఇబ్బందులు, వారి మనస్తత్వాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. భార్యభర్తల మధ్య తగాదాలు గుండెను పిండివేస్తాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఓ అమ్మాయిని కల వెంటాడుతుంటుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది అలా సినిమా మొదటి భాగం పూర్తవుతుంది.

ఇక రెండో భాగంలో అమ్మాయి ఏ విధంగా తన డ్రీమ్‌ను నెరవేర్చుకున్నది. అందుకు మ్యూజిక్ డైరెక్టర్ శక్తి కుమార్ ఏ విధంగా తన సహకారం అందించాడు. కూతురు కలను సాకారం చేయడానికి తల్లి ఓ తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. తన కలను గెలిపించడం వెనుక ఉన్న సీక్రెట్ సూపర్‌స్టార్ గురించి ఇన్సియా చెప్పే ఓ బలమైన సన్నివేశంతో కథ ముగిస్తుంది. అసలు ఈ చిత్రంలో సీక్రెట్ సూపర్‌స్టార్ ఎవరన్నది ప్రేక్షకుడి జడ్జిమెంట్‌కు వదిలేయాల్సిందే…

దంగల్‌ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన జైరా వసీమ్ మరోసారి వెండితెరపై మెరుపులు మెరిపించింది. ఓ వైపు తన కల, మరో వైపు కుటుంబ పరిస్థితుల మధ్య నలిగిన పదిహేను ఏళ్ల అమ్మాయి పాత్రలో వసీమ్ నటన అమోఘం. ఈ సినిమాకు సీక్రెట్ సూపర్‌స్టార్‌గా మారిన వారిలో ఆమెదే ప్రధాన భూమిక. ఈ చిత్రాన్ని తన నటనతో మరోస్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

అమీర్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటన అద్భుతం అంటే రొటీన్ అవుతుంది. శక్తి కుమార్ అనే మ్యూజిక్ డైరెక్టర్ పాత్రలో మరోసారి వెండితెరపై తన విశ్వరూపం చూపించాడు. తొలుత ఇంత చెండాలమైన క్యారెక్టర్ వేశాడనే ముద్ర వేసినప్పటికీ.. ఆ తర్వాత క్రమక్రమంగా మన హృదయాలను గెలుచుకొంటాడు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్‌ది పక్కా టపోరి క్యారెక్టర్. ఏక్ దమ్ కార్టూన్‌లా కనిపిస్తాడు. ఒక్కొసారి కమెడియన్ లేని లోటునూ తీరుస్తాడు. మరోసారి హీరో పాత్రకు నిలువెత్తు విగ్రహంలా నిలుస్తాడు. ఇక అమీర్ గురించి చాలానే చెప్పవచ్చు. అది సినిమా చూస్తే మీరే తెలుసుకొంటారు.

తుది తీర్పు ప్రతీవారం, ప్రతీ నెల, ప్రతీ ఏడాది ఎన్నో సినిమాలు చూస్తుంటాం. చాలా వరకు సినిమాలన్నీ థియేటర్ గేట్ బయటకు వచ్చిన తర్వాత గుర్తు తెచ్చుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. కానీ సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమా అలాంటిది కాదు. కొన్నిగంటలు కాదు.. కొన్ని రోజులు వెంటాడే చిత్రం. ఇలాంటి చిత్రానికి ప్రేక్షకుడిగా 5 పాయింట్లకు 5 పాయింట్లు ఇవ్వొచ్చనే భావన కలిగింది. సినీ విమర్శకుడిగా లోపాలు వెతికి రేటింగ్ ఇచ్చే బుద్ది కాబట్టి 4.5/5 అడ్జస్ట్ అయిపోతాను.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *