జయలలితకు నమ్మక ద్రోహం: రూ. 300 కోట్లు గోల్ మాల్ !

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోన్ రావు నమ్మక ద్రోహం చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసిందని తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి అడ్డం పెట్టుకున్న రామ్మోహన్ రావు తన కుమారుడు వివేక్, అతని స్నేహితులకు చట్ట వ్యతిరేకంగా సహాయం చేశారని, వాటికి సంబందించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని దర్యాప్తు చేస్తున్న అధికారులు అంటున్నారు.

తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులను రామ్మోహన్ రావు ఆయన కుమారుడు వివేక్, అతని స్నేహితుడు భాస్కర్ నాయుడికి ఇప్పించారని అధికారులు తెలిపారు.

రామ్మోహన్ రావు ఇంటిలో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్దతిలో హౌస్ కీపింగ్, క్లీనింగ్, సెక్యూరిటీ విభాగాల్లో ఉద్యోగులను నియమించడానికి భాస్కర్ నాయుడికి రూ. 300 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇప్పించారని వెలుగు చూసింది.

కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొందరు ఉద్యోగులు రామ్మోహన్ రావుకు పరిచయం ఉండటంతో వారి సహాయంతో శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్శిటి, సౌత్ సెంట్రల్ రైల్వే, తమిళనాడు టూరిజం, బీహెచ్ఇఎల్ లో భాస్కర్ నాయుడికి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇప్పించారని ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలిపారు. భాస్కర్ నాయుడు కంపెనీల్లో రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ కు భాగస్వామ్యం ఉందని అధికారులు చెప్పారు. అంతే కాకుండా బెంగళూరులోని విలాసవంతమైన అపార్ట్ మెంట్స్, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రామ్మోహన్ రావు కుమారుడికి భాగస్వామ్యం ఉందని అధికారులు తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *