తమిళ స్టార్ ‘విజయ్’ పొలిటికల్ ఎంట్రీ..!

చెన్నై: దివంగత సీఎం జయలలిత మృతి తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఒక శూన్యత ఏర్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడును జయలలిత స్థాయిలో సమర్థవంతంగా నడిపే మరో రాజకీయ నాయకుడు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నారా? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో తమిళ జనం సైతం అక్కడి సినీ తారల వైపు చూస్తున్నారు.

జయలలిత, కరుణానిధి వంటి వారు సినిమా నేపథ్యం నుంచి వచ్చి రాజకీయాల్లో పాగా వేసినవారే కాబట్టి.. అక్కడి ప్రజలంతా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే రజనీ మాత్రం ఎప్పటికప్పుడు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చుతూనే ఉన్నారు. అదే సమయంలో రజనీ తర్వాత తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇళయదళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై సైతం పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా, గతంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ప్రయత్నించి విజయ్ వెనక్కి తగ్గారు. ప్రస్తుత తమిళ రాజకీయాల్లో ఒక అనిశ్చితి నెలకొనడంతో విజయ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు అక్కడి జనం నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదే ప్రశ్నను విజయ్ తండ్రి అయిన సీనియర్ దర్శకుడు చంద్రశేఖర్ ని కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.

గత పదేళ్ల క్రితం విజయ్ రాజకీయాల్లోకి రావాలని తాను ఆకాంక్షించానని, కానీ ప్రస్తుత రాజకీయాలు వ్యాపారంగా మారిపోయిన పరిస్థితి నెలకొందని చంద్రశేఖర్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ పొలిటికల్ ఎంట్రీ జరగకపోవడమే మంచిదని ఆయన అన్నారు. అదే సమయంలో నిర్మాతల మండలి ఎన్నికల గురించి కూడా చంద్రశేఖర్ ప్రస్తావించారు.

నిర్మాతల మండలి నిబంధల ప్రకారం ఏ నటుడైనా, నిర్మాత అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని పేర్కొన్నారు. అయితే తమకున్న విధి విధానాల ప్రకారం ఒక సంఘానికి ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తూ మరో సంఘంతో అదే స్థాయిలో పదవి బాధ్యతలు నిర్వహించడం సాధ్యం కాదని పరోక్షంగా నటుడు విశాల్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. పైరసీని అరికట్టేందుకు ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లుగా తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *