వెంకయ్య జోస్యం..మోడీ నుంచి మరో సంచలనం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో మరో సంచలన ప్రకటన చేయనున్నారని  కేంద్ర పట్టణాభివృద్ధి – గృహ నిర్మాణం – సమాచార ప్రసారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం రాయుళ్లను కుదిపేసిన ప్రధాని త్వరలో ప్రకటించబోయే మరో ప్రకటనతో మరింత సంచలనం సృష్టిస్తారని అన్నారు. యథావిధిగా దీన్ని కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ప్రజలు మద్దతివ్వాలని ఆయన ఆశించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద ఉన్న విశ్వ ప్రియ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో డిజిధన్ మేళాను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునే ప్రతి నిర్ణయం సామాన్యులకు మేలు చేయడమేనని చెప్పారు. దేశానికి సంపద ఉంటేనే పథకాల రూపంలో పంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆదాయం లేకుండా పంచితే పంచె కూడా మిగలదని ఆయన చలోక్తి విసిరారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం ఇదే పనిచేసి దేశాన్ని ఈ స్థితికి దిగజార్చిందన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ నిర్ణయమైనా సక్రమంగా అమలై మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు.

నల్లధనం రూపంలో కొందరి చేతుల్లోనే ధనం ఉండిపోయి అవినీతి – ఉగ్రవాదం – వేర్పాటువాదం – మాదక ద్రవ్యాలు వంటివి దేశ వినాశనానికి మద్దతిస్తున్నాయని వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సంచలనాత్మకమైన ప్రయోగాత్మక నిర్ణయం తీసుకుని పెద్ద నోట్ల చలామణికి చెక్ చెప్పి – ఆర్థిక సమానత్వం దేశ ప్రజలందరికీ కల్పించే పని చేపట్టారని చెప్పారు. ఈ విషయంలో 50 రోజుల పాటు ప్రజలు ఇక్కట్లను అనుభవించడం కూడా ఉన్న మంచి ఫలితమేనని ఆయన వివరించారు. 58 శాతం దేశ సంపద మొత్తం 1 శాతం వ్యక్తుల వద్దే ఉండిపోయిందని చెప్పారు. ప్రతిపక్షాలు చేయాల్సిన అవినీతి వ్యతిరేక పోరాటం ప్రభుత్వం స్వయంగా చేస్తుంటే అలా చేయొద్దంటూ ప్రతిపక్షాలు చేస్తున్న హడావిడిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.  ప్రజలు సైతం ఆదరిస్తున్నారని ప్రతిపక్షాలు గోల చేస్తున్నా ఇది మోడీ డిజిటల్ విజయంలో కొట్టుకుపోతుందన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లు చేసే అభివృద్ధిలో పూర్తి సహకారం అందిస్తూ ప్రజలు ఇస్తున్న తోడ్పాటు ఎప్పటికీ కొనసాగాలని వెంకయ్యనాయుడు ఆశించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *