మోడీకి ట్రంప్ ఫోన్: ఏం మాట్లాడారంటే..?

వాషింగ్టన్‌: నాలుగు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్‌.. మంగళవారం అర్ధరాత్రి(ఒంటి గంట ప్రాంతంలో) ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ కార్యాలయం మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ వెల్లడించారు. కాగా, ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫోన్‌ చేసి మాట్లాడిన ఐదో ప్రభుత్వాధినేత మోడీ కావడం గమనార్హం.

మంగళవారం రాత్రి ప్రధాని మోడీ.. ట్రంప్‌కి మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల మధ్య సైనిక, ఆర్థిక రంగాల్లో భాగస్వామ్యం బలోపేతంపై చర్చించారు. వచ్చే ఏడాది మోడీని అమెరికా పర్యటనకు రావాలని ట్రంప్ ఆహ్వానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సవాళ్లను అధిగమించడంలో భారత్ ఓ నిజమైన స్నేహితునిగా ట్రంప్ అభివర్ణించారు.

భద్రతాపరమైన అంశాలతోపాటు పలు కీలక అంశాలపై ఇరుదేశాల నేతలు చర్చించినట్లు వైట్ హౌస్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కాగా, ట్రంప్‌తో సుహృద్భావరీతిలో సంభాషించానని ప్రధాని మోడీ కూడా ట్విట్టర్‌లో తెలిపారు.

రానున్న రోజుల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునేందుకు కలిసి సన్నిహితంగా పనిచేయాల్సిన అవసరంపై తాను, ట్రంప్‌ ఏకీభవించామని ఆయన పేర్కొన్నారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా ట్రంప్‌ను ఆహ్వానించినట్టు ప్రధాని మోడీ వెల్లడించారు. కాగా, అధ్యక్షుడి హోదాలో మోడీతో ట్రంప్‌ మాట్లాడడం ఇదే మొదటిసారి.

జనవరి 21 నుంచి కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్‌, ఈజిప్టు ప్రధానులతో మాట్లాడారు. రష్యా, చైనా, జపాన్‌, ఐరోపా దేశాధినేతల కన్నా ముందుగానే ట్రంప్‌ భారత దేశాధినేతతో మాట్లాడటం విశేషం. ట్రంప్‌ విజయం తర్వాత ఆయనకు ఫోన్‌ చేసి అభినందనలు తెలియజేసిన తొలి ఐదుగురు ప్రపంచనేతల్లో మోడీ ఒకరు. తాను ప్రత్యేక సంబంధాలు కొనసాగించబోయే దేశాల్లో భారత్‌ కూడా ఒకటని ప్రచారం సందర్భంగా ట్రంప్‌ ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. ‘నా హయాంలో అమెరికా, భారత్‌ల మధ్య స్నేహం ఇంకా మెరుగ్గా ఉంటుంది.’ అని న్యూజెర్సీలోని ఎడిసన్‌ వద్ద గతంలో నిర్వహించిన హిందూ-అమెరికన్‌ కార్యక్రమంలో ట్రంప్‌ చెప్పారు. మోడీ శక్తిమంతమైన నేత అని ప్రశంసించారు. ఆయనతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా చూస్తున్నానన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *