జైట్లీ ఆన్ లైన్ డిస్కౌంట్లు భలేగున్నాయే

పెద్ద నోట్లరద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్రం.. తాజాగా అందుకు అనుగుణమైన ప్రోత్సాహకాలను డిస్కౌంట్ల రూపంలో ప్రకటించింది. పెట్రోల్ డీజిల్ రైల్వే టికెట్ల కొనుగోలు టోల్ట్యాక్స్ లాంటి వాటిని డిజిటల్ రూపంలో చెల్లిస్తే వాటిమీద తగ్గింపు ఉంటుందని ఆర్థికమంత్రి జైట్లీ వెల్లడించారు. పెట్రోల్/డీజిల్ రైల్వేటికెట్లతో పాటు ప్రభుత్వరంగసంస్థలకు చెందిన బీమా పాలసీల కొనుగోళ్లకు డెబిట్ క్రెడిట్కార్డులను లేదా ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తే కొంతమొత్తం ఆదా అవుతుంది. కార్డుల ద్వారా రూ.2000 వరకూ జరిపే చెల్లింపులపై సేవాపన్నును కూడా కేంద్రం తొలగించింది. ఈ వివరాల్ని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ వెల్లడించారు.

పెట్రోల్ డీజిల్ కొనుగోలు మీద 0.75 శాతం తగ్గింపు ఉంటుందన్నారు. దీనిప్రకారం.. ఢిల్లీలో రూ.66.10 ఉన్న లీటరు పెట్రోల్ మీద 49 పైసల చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది. రూ.54.57 ఉన్న లీటరు డీజిల్ మీద 41 పైసల చొప్పున ఆదా అవుతుంది. ఎల్ఐసీ లాంటి ప్రభుత్వరంగ బీమాసంస్థలు కొత్త బీమా పాలసీల కొనుగోలు పాత పాలసీల ప్రీమియం చెల్లింపును ఆన్లైన్ డిజిటల్ పద్ధతుల్లో జరిపితే డిస్కౌంట్ ఇస్తాయి. డిస్కౌంట్ల భారాన్ని ఆయా ప్రభుత్వ విభాగాలే భరిస్తాయని జైట్లీ తెలిపారు. డిస్కౌంట్లను ప్రకటించిన విభాగాల్లో అత్యధికం కేంద్రానికి లేదా ప్రభుత్వసంస్థలకు చెందినవేనన్నారు. రూ.2 వేలలోపు కార్డు చెల్లింపులపై సేవాపన్నును తొలగించిన అంశాన్ని ప్రస్తావిస్తూ డెబిట్ క్రెడిట్కార్డుల ద్వారా జరిగే మొత్తం లావాదేవీల్లో 70 శాతం రూ.2 వేల లోపువేనన్నారు.

జైట్లీ ప్రకటించిన ఇతర డిస్కౌంట్లు కేంద్రప్రభుత్వ నిర్ణయాలు ఇలా ఉన్నాయి…

-జనవరి 1 నుంచి నెలవారీ సీజనల్ సబర్బన్ రైల్వేటికెట్లను డిజిటల్ ప్రక్రియలో కొంటే వాటిమీద 0.5 శాతం తగ్గింపు. దీంతో ప్రయాణికులకు గరిష్ఠంగా రూ.10 ఆదా.

-రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేస్తే రూ.10 లక్షల విలువైన ప్రమాదబీమా ఉచితంగా లభిస్తుంది.

-రైల్వేలో భోజనం వసతి సదుపాయాలతోపాటు విశ్రాంతిగదులకు డిజిటల్ పద్ధతిలో చెల్లిస్తే 5 శాతం తగ్గింపు

-జాతీయరహదార్ల మీద టోల్ట్యాక్స్ చెల్లింపునకు ఆర్ఎఫ్ఐడీ లేదా ఫాస్ట్ట్యాగ్ల ఏర్పాటుకు డిజిటల్రూపంలో చెల్లిస్తే దాని మీద 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇది వచ్చే మార్చి నెలాఖరువరకూ అందుబాటులో ఉంటుంది.

-వినియోగదారుల డెబిట్ క్రెడిట్కార్డులను అంగీకరించటానికి వీలుగా వ్యాపారులు ఇప్పటికే తమవద్ద ఏర్పాటుచేసుకున్న పీఓఎస్ టెర్మినల్ మైక్రో ఏటీఎం మొబైల్ పీఓఎస్లకు నెలకు రూ.100కు మించి కిరాయి చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వరంగ బ్యాంకులు సూచించాయి.

-10వేలకన్నా తక్కువ జనాభా ఉన్న లక్ష గ్రామాల్లో రెండు మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్ను ఏర్పాటు చేయటానికి బ్యాంకులకు నాబార్డ్ ద్వారా ఆర్థికసాయం. గ్రామీణప్రాంతాలకు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను విస్తరింపజేయటం కోసం ఈ నిర్ణయం. దీంతో దాదాపు 75 కోట్లమందికి లబ్ధిని చేకూర్చే నిర్ణయమని తెలిపారు.

-4.32 కోట్ల మంది కిసాన్కార్డుదారులకు గ్రామీణ బ్యాంకులు సహకార బ్యాంకులు రుపాయి కిసాన్ కార్డులను మంజూరు చేస్తాయి. దీనివల్ల వారు పీవోఎస్ మెషిన్లు మైక్రో ఏటీఎంలు ఏటీఎంల వద్ద డిజిటల్ లావాదేవీలను నిర్వహించటానికి వీలవుతుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *